Thursday, 14 December 2017

లే.. మేలుకో.. గమ్యాన్ని చేరేవరకు విశ్రమించకు.

https://drive.google.com/file/d/0B55h89yHBv0-Y2E1M0VXT1Q3SHM/view?usp=sharing

             
                                    1947 అగస్ట్ 15 భరత మాతకు ద్రాస్య శృంఖలాలు తెగిపడిన రోజు. భారత జాతి యావత్తు స్వేచ్ఛ   వాయువులు పీల్చుకున్న ఘనమైన రోజు.స్వతంత్ర దేశం కోసం ప్రాణాలను, జీవితాలను పోగొట్టుకున్న ఎందరో మహానుభావుల కలలు నిజమైన రోజు. ఈ సువిశాల,  ప్రజాస్వామ్య, గణతంత్ర భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటికి డెబ్భైఐదు సంవత్సరాలు గడిచినా సాధించింది ఎంతో ఉన్నా, సాధించాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఇంకెన్నాళ్లు మన భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండాలి. ఏ దేశానికి లేని యువ శక్తి కేవలం మన భారత దేశం సొంతం.అసమాన, అసాధారణ ప్రతిభ మన యువత సొంతం. ఇటువంటి ఈ భారత దేశ యువత తలుచుకుంటే మన దేశం  ఒక అత్యుత్తమ శక్తిగా ఎదగటం గొప్ప విషయం కాదు.
Hiroshima town after II world war

old singapore





                     రెండవ ప్రపంచ యుద్ధం లో రెండు అణుబాంబులు తన గుండెలపై పడి, అతలాకుతలం చేసినా , అదరకుండా, బెదరకుండా,ఒక సూపర్ పవర్ కంట్రీ గా ఎదిగింది జపాన్.1965 లో బానిస సంకెళ్లు తెచ్చుకొని స్వతంత్ర దేశంగా ప్రాణం పోసుకొంది సింగపూర్. ఎన్నో గడ్డు పరిస్థితులు, ఇంకెన్నో అవాంతరాలు, అడుగడుగునా పేదరికం తాండవించింది అయినా దారుణ పరిస్థితులకు ఎదురొడ్డి నేడు అత్యుత్తమ దేశాలలో ఒకటిగా నిలిచింది సింగపూర్. ఆ  దేశాలు ఎలా అభివృద్ధి చెందాయి, మన దేశం ఎందుకు దశాబ్దాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశంగానే మిగిలింది. ఇందుకు కారణాలెన్నో ఉండి  ఉండవచ్చు, వాటిని సమర్థించుకుంటూ ఉంటే అభివృద్ధికి ఆమడ దూరంలోనే నిలిచిపోతాము. అదే కారణాలను విశ్లేషించుకుని, మనల్ని మనం ప్రశ్నించుకుంటేనే అభివృద్ధి గురించి ఆలోచించగలం.

                                         అభివృద్ధి చెందిన ఏ దేశాన్ని చూసినా, ఆ దేశంలో కూలి పని చేసుకొనే వాడి నుండి, దేశాన్ని ఏలే అధ్యక్షుడి వరకు ప్రతి ఒక్కరి గుండెల్లో నా దేశం అనే భావన, నా దేశం అభివృద్ధి చెందాలనే పట్టుదల బలంగా ఉంటుంది. అలాగే మన గుండెల్లోనూ ఒక భావన ఉంది,  నా కులం అభివృద్ధి చెందాలని, నా మతం అభివృద్ధి చెందాలని, నా ప్రాంతం అభివృద్ధి చెందాలని.ఇటువంటి భావాలతో అభివృద్ధి సాధ్యమా? మనలో ఎంత మందికి నా దేశం అన్న భావన గుండెల్లో ఉంది. ఓట్ల కోసం కొంత మంది రాజకీయ నాయకులు వేసిన కులాల, మతాల, మత్తులో ఊగుతున్నాం.  ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ అధికారులే , కోట్లకు కోట్లు అక్రమంగా సంపాదించి ఏసీబీ అధికారులకు దొరుకుతున్న ఎందరో అవినీతి తిమింగలాను రోజు చూస్తూనే ఉన్నాం. ఓట్ల కోసం ఇల్లిల్లు తిరిగి, గెలిచిన తరువాత అభివృద్ధి అన్న పదాన్నే మరిచిన ఎంతో మంది  నాయకులు మనకు కనబడుతూనే ఉన్నారు. ఇటువంటి వారు పుట్టుకు రావటానికి కారణం ఎవరు. నువ్వా? లేక నేనా ? వ్యవస్థలో లోపం ఉందా?ఆ వ్యవస్థలో ఉన్న మనలో లోపం ఉందా? కారణం ఏమైనా కావచ్చు. ఇటువంటి వారు ఉన్నంత కాలం 130 కోట్ల మంది భారతీయులలో  ఏ ఒక్కరు అభివృద్ధి కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రజలను పాలించే నాయకులలోను,ప్రజలకు సేవ చేయాల్సిన అధికారులలోను అవినీతి    తాండవిస్తున్నంత కాలం భారత దేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే మిగిలిపోతుంది.
                         
               కేవలం ఒక్క అవినీతి అంతం అయిపోతేనే  దేశం అభివృద్ధి జరగదు. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచనలు గొప్పగా ఉండాలి. ఆ ఆలోచనలు దేశ మార్పు కోసం ఉపయోగపడాలి. భగత్ సింగ్,ఆజాద్,సుభాష్ చంద్రబోస్ లాగా దేశం కోసం ప్రాణాలు అర్పించే ఆ అవసరం మనకిప్పుడు లేదు. కానీ వారు కన్న కలల భారతాన్ని నిర్మించే భాద్యత భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరిపైనా ఉంది. అభివృద్ధి  కోసం మనం చేయవలసిన పనులు చాల చిన్నవే. అందులో మొదటిది ఈ సువిశాల భారత దేశం లో మనం కూటి కోసం ఏ పని చేసినా అది అవినీతి రహితంగా, బాధ్యాతాయుతంగా చేయాలి. రెండవది రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుతో అభివృద్ధి ని కాంక్షించే నాయకులను ఎన్నుకోవాలి. మూడవది కులాల, మతాల, ప్రాంతాల కుంపట్లను వదిలి నేను భారతీయున్ని అన్న భావన మనసులో ఏర్పరుచుకోవాలి. అప్పుడే  మనం పొందిన స్వాతంత్ర్యానికి, అందుకోసం పోరాడి ప్రాణాలను అర్పించిన మహానుభావుల కలలకు అర్థం ఉంటుంది.

          ఇప్పుడైనా......

     లే.... మేలుకో........ నీ గమ్యమేంటో ఇప్పుడే నిర్ణయించుకో ....... ఈ క్షణమే నిర్ణయించుకో...... దేశం కోసం  శ్రమించు...... జాతి యావత్తు గర్వపడేలా ఎదుగు.......... లే ............⇑
                                                                                        by
                                                                                                  
                                           G. Ravindra Nath Tagore
                                   TELUGUINSPIRE.BLOGSPOT.IN
 
                                               











                                         

1 comment:
Write comments

Follow on FaceBook