Monday, 17 February 2020

మహా రాతల వారి మనసులో మాట - చేయి జారిన కలల ప్రపంచం...

ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని జ్ఞాపకాలు గుండె లోతుల్లో దాగి ఉంటాయి. భారమైనా , సంతోషమైనా వాటితో సావాసం చేయకతప్పదు. అలాంటి ఓ వ్యక్తి జీవితంలో దాగి ఉన్న ఓ అందమైన చేదు జ్ఞాపకమే ఈ మనసులో మాట 

కోరుకున్న జీవితమైతే దక్కింది కానీ, ఆ జీవితంలోనే తను లేకుండా పోయింది....
= = = = = = = = = = = = = = = = = = = = 

                         చిన్నప్పుడే అమ్మ చనిపోవటంతో ఆ ప్రేమను పొందలేకపోయాను. నాన్న ఉన్నప్పటికీ అతనికి అంతగా దగ్గరకాలేకపోయాను. బంధాలకు, బంధుత్వాలకు దూరంగా హాస్టల్ లో ఉండటంతో చిన్నప్పటి ఎన్నో మధురానుభూతులను కోల్పోయాను. నా గురించి ఆలోచించేవాళ్ళు కానీ, ప్రేమగా పలకరించేవారు కానీ ఎవ్వరూ ఉండేవారు కాదు, అందుకే చిన్నపట్నుండి ఆ ఒంటరితనంలో ఒకటే కల, నాకంటూ ఒక కుటుంబం, ఆ కుటుంబాన్ని పోషించే ఓ చిన్న ఉద్యోగం చాలు అని అనుకునేవాడిని. ఆ కల కల్ల కాకూడదని చిన్నపట్నుండి బాగా చదివేవాడిని.

                      పీజీ చేస్తున్నప్పుడు చూసా శ్రావ్యని. క్లాస్ లో ఎవరితో పెద్దగా మాట్లాడేది కాదు, కానీ అప్పుడపుడు  సరదాగా నన్ను పలకరించేది. ఆ పలకరింపులే కాస్త ఎక్కువయ్యి మా మధ్య స్నేహం చిగురించింది. అప్పటివరకు వరకు ఎవరి ప్రేమకు , స్నేహానికి నోచుకోని నాకు తన స్నేహం తెలియని ఒక కొత్త ఆనందాన్ని ఇచ్చింది. ఎప్పుడు నా మీద ప్రత్యేకమైన శ్రద్ధని చూపేది. అడక్కుండానే నా కష్టం గురుంచి తెలుసుకుని సహాయం చేసేది. వద్దని చెప్పినా ప్రతి పండక్కి కొత్త బట్టలు కొనిచ్చేది. నా ప్రతి చిన్న ఆనందంలోనూ తను పాలుపంచుకొనేది. మా స్నేహాన్ని చూసి క్లాసులో ఉన్నవాళ్ళందరు అసూయపడేవారు. వాళ్ళ అమ్మనాన్నలకు కూడా నన్ను పరిచయం చేసింది. వాళ్ళు కూడా నన్ను వాళ్ళ ఇంట్లో ఒకడిగా  చూసుకునేవారు. మా ఇద్దరి స్నేహాన్ని చూసి ఎంతో సంతోషించేవారు. తనతో గడిపిన ఆ రెండు సంవత్సరాలు నాకు ఎన్నో ఎన్నో మధురానుభూతులను మిగిల్చింది.  ఎప్పుడైనా , ఎక్కడైనా మార్పు అనివార్యమే, ఆ మార్పు మా జీవితాల్లో కూడా జరిగింది.
             పీజీ అయిపోయిన తరువాత వెంటనే కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చేసాను. ప్రభుత్వఉద్యోగం కోసం  రాత్రి పగలు కష్టపడేవాడిని. అయినా అప్పుడప్పుడు శ్రావ్యతో ఫోన్లో మాట్లాడేవాడిని. కానీ ఈ పోటీ ప్రపంచంలో ప్రభుత్వఉద్యోగం సాధించటం అంటే అనుకున్నంత సులభం కాదని అర్థమైంది. ఏ ఎగ్జామ్ రాసిన ప్రతిసారి కొద్దిలోనే మిస్ అయ్యేది. ఉద్యోగం సాదించలేనేమోనన్న అపనమ్మకం  ఒక వైపు, కోరుకున్న జీవితం దక్కదేమోనన్న భయం మరో వైపు, ఇదే సమయంలోనే శ్రావ్య తో మాట్లాడటం పూర్తిగా తగ్గిపోయింది.
                                             కానీ ఒక రోజు శ్రావ్య నుంచి ఫోన్ వచ్చింది. ఏడుస్తూనే ఉంది , విషయమేంటని అడిగితే తనకు రెండు రోజుల్లో పెళ్లి జరగబోతుంది అని చెప్పింది. సంతోషపడాల్సిన విషయమే కదా అని చెబితే  అప్పుడు చెప్పింది తను " నేను నిన్ను పీజీ లో ఉన్నపటినుండే ప్రేమిస్తున్నా, కానీ ఆ విషయం నీకు చెప్పటానికి భయమేసి నాలోనే దాచుకున్నా, నీతో జీవితాంతం బ్రతకాలని ఉంది, నన్ను తీసుకుపో " అని చెప్పింది.
    ఆ మాట విన్న వెంటనే నాకు నోట మాట రాలేదు, గుండె పగిలినంత పని అయ్యింది. తనంటే నాక్కూడా చాలా  ఇష్టమే, కానీ ఎక్కడ తన  స్నేహాన్ని కోల్పోతానేమేమోనన్న భయంతో తనకు నా ప్రేమ విషయం చెప్పలేకపోయా. తను నాపై చూపించిన ప్రేమ ను స్నేహమే అని అనుకున్నా...
               
                    పెళ్ళికి రెండు రోజులముందు పెళ్ళి కూతుర్ని లేపుకురావటానికి నేను సినిమాలో హీరోను కాదు, ప్రస్తుతం నన్ను నేను పోషించుకోవటమే  కష్టంగా ఉంది ,  అటువంటి ఈ స్థితిలో నేను ఈ సాహసం చేయలేను అని చెప్పి నాకన్నా అతనే నీకు సరైన వాడు, అతనినే పెళ్లి చేసుకో అని చెప్పా. నా మాటల వెనుక చెప్పుకోలేని కన్నీటి హృదయం దాగి ఉందని తను ఆ రోజు అర్థం చేసుకోలేకపోయింది. ఆ తరువాత తను ఎప్పుడు నాతో మాట్లాడటానికి ప్రయత్నించలేదు.

               ఇప్పటికి తను నా జీవితం నుంచి వెళ్ళిపోయి ఆరు సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు నేను కోరుకున్న ఉద్యోగం నాకు దక్కింది, సమాజంలో పేరు, హోదా, డబ్బు అన్ని ఉన్నాయి, కానీ నా దగ్గర ఏమిలేనప్పుడు నన్ను నన్నుగా, స్వచ్చంగా ప్రేమించిన శ్రావ్య మాత్రం నా దగ్గర లేదు, జీవితంలో అనుకున్నది సాధించానన్న సంతోషం కన్నా , శ్రావ్యను పొందలేకపోయానన్న బాధే నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంది.
                                                                     - కిరణ్, వరంగల్.

ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని జ్ఞాపకాలు గుండె లోతుల్లో దాగి ఉంటాయి. భారమైనా , సంతోషమైనా వాటితో సావాసం చేయకతప్పదు. అలాంటి మీ అందమైన జ్ఞాపకాలను మాతో పంచుకోండి. 



No comments:
Write comments

Follow on FaceBook